: పొడగరి గట్టయ్యకు గుండెపోటు... చికిత్స పొందుతూ కన్నుమూత
తెలుగు రాష్ట్ర ప్రజలకు ‘పొడగరి’గా పరిచయం అయిన గట్టయ్య గుండె పోటుకు గురయ్యాడు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే నిన్న రాత్రి తుది శ్వాస విడిచాడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పుట్నూరుకు చెందిన గట్టయ్య ఓ రకమైన వ్యాధి కారణంగా అసాధారణ ఎత్తు పెరిగాడు. ఏకంగా 7.5 అడుగుల ఎత్తు పెరిగిన గట్టయ్య ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. అసాధారణ ఎత్తుతో పలువురు ప్రముఖులను ఆకట్టుకున్న అతడికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదాపూర్ లోని శిల్పారామంలో ఉద్యోగం ఇచ్చారు. దీంతో మొన్నటి దాకా అక్కడే ఉన్న గట్టయ్య శిల్పారామం వచ్చిన వారందరిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. శిల్పారామంలోనే అతడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడి ఎత్తుకు అచ్చెరువొందిన పలువురు ప్రముఖులు అతడితో కలిసి ఫొటోలు కూడా తీసుకున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కూడా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురైన గట్టయ్య హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, నిన్న రాత్రి గుండెపోటు కారణంగా కన్నుమూశాడు.