: ఓట్ల తొలగింపులో సోమేశ్ ఏకపక్ష నిర్ణయాలు... ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర బృందం


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ప్రత్యేక బృందం ఆగ్రహం వ్యక్తం చేసిందట. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగిపోయింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన విపక్షాలు ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేశాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కొన్ని పక్కా సాక్ష్యాలతో సోమేశ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కూడా దీనిపై ఎన్నికల సంఘానికి పలు ఆధారాలు సమర్పించారు. వీటిపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్ లో సీఈఓగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ గుప్తా నేతృత్వంలో అధికారుల బృందాన్ని హైదరాబాదు పంపింది. నిన్న హైదరాబాదు వచ్చిన ఈ బృందం ఓట్ల తొలగింపులో పలు అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించింది. కొంత మంది ఓటర్లకు సోమేశ్ కుమార్ అసలు నోటీసులే జారీ చేయలేదని తేల్చింది. దీంతో గ్రేటర్ అధికారులతో భేటీ సందర్భంగా సోమేశ్ పై కేంద్ర బృందం అసహనం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, కేంద్ర బృందం ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే సోమేశ్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News