: నిలవని లాభాలు... రూ. 43 వేల కోట్ల నష్టం!
సెషన్ ఆరంభంలో కనిపించిన భారత స్టాక్ మార్కెట్ లాభాలు, మధ్యాహ్నం తరువాత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా దిగివచ్చాయి. ఆసియా మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంటును అమ్మకాల వైపు నడిపించిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 181.31 పాయింట్లు పడిపోయి 0.68 శాతం నష్టంతో 26,656.83 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 45.95 పాయింట్లు పడిపోయి 0.57 శాతం నష్టంతో 8,065.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.13 శాతం, స్మాల్ క్యాప్ 0.78 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు లాభపడగా, ఐటీసీ, ఎల్అండ్ టీ, వీఈడీఎల్, ఎంఅండ్ఎం, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు నష్టపోయాయి. గురువారం నాడు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 98,80,117 కోట్లుగా ఉండగా, అది నేడు రూ. 98,33,359 కోట్లకు తగ్గింది. మొత్తం 2,806 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 998 కంపెనీలు లాభాలను, 1,615 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. మిగిలిన 193 కంపెనీల ఈక్విటీ ధరల్లో మార్పు నమోదు కాలేదు.