: విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారా?... కాస్త జాగ్రత్త!
వివిధ విటమిన్ల లోపాల కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని ఎందరినో మనం చూస్తుంటాం. డాక్టర్ల దగ్గరకు వెళ్తే, విటమిన్ సప్లిమెంట్లను వాడమంటారు. ఈ క్రమంలో రెగ్యులర్ గా విటమిన్ ట్యాబ్లెట్లు, టానిక్ లు వాడుతూ ఉంటాం. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఉందంటూ అమెరికా మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సప్లిమెంట్లను వాడుతున్న వారిలో తమ ఆరోగ్యం పట్ల విపరీతమైన ధీమా పెరుగుతుందట. దీంతో, అనారోగ్యకరమైన దినచర్యలకు వారు అలవాటు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. వారి పరిశోధన సారాంశం 'సైకలాజికల్ సైన్స్' అనే జర్నల్ లో ప్రచురితమైంది. ఈ పరిశోధన ప్రకారం విటమిన్ సప్లిమెంట్లు వాడే వారు వ్యాయామానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరట. అంతేకాకుండా, ఇక తమకేమీ కాదనే ధోరణితో ఏది పడితే అది లాగించి స్థూలకాయులుగా మారుతారట. ఇలాంటి కారణాలతో వీరు బీపీ, గుండె సంబంధిత జబ్బులు, మధుమేహం తదితర సరికొత్త వ్యాధులను కొనితెచ్చుకునే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.