: కార్తీక పౌర్ణమి వస్తోంది... మీ తోడూ నీడకు ఏం బహుమతి ఇస్తారు?
మరో నెల రోజుల్లో కార్తీక పౌర్ణమి వస్తుంది. తమ భర్తలు, కాబోయే జీవిత భాగస్వాముల మేలు కోరుతూ అతివలు వ్రతాలు చేసే వేళ. ఉత్తరాదిన 'కర్వా చౌత్' పేరిట ఈ పర్వదినం జరుగుతుంది. దక్షిణాదిన సైతం యువతులు ఆ రోజున ఉపవాసాలుండి, తమవారి మేలు కోరుతూ వ్రతాలు చేసే సంప్రదాయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పురుషులు, తమ మేలు కోరి వ్రతాలు, పూజలు చేసే జీవిత భాగస్వామికి, కాబోయే భాగస్వామికి ఏమిచ్చినా రుణం తీరదు. కానీ వారికి ఆనందం కలిగేలా ఏవైనా బహుమతులు ఇచ్చి మరింత దగ్గర కావచ్చు. ఈ నేపథ్యంలో జీవితాంతం తోడు, నీడగా నిలిచేవారికి ఏమివ్వచ్చంటే... అందాన్ని మెరుగులు దిద్దే ప్రొడక్టులు: మీకు వివాహమై, జీవిత భాగస్వామి గృహిణిగా ఉన్నా, లేక కాబోయే జీవిత భాగస్వామి అయినా, వారికి అందం ఇనుమడింపజేసేలా స్పా ట్రీట్ మెంట్ ను బహుమతిగా ఇవ్వొచ్చు. దాంతో వారి ఆనందం, మీపై ఆప్యాయతా పెరుగుతాయి. వారి అందాన్ని ఇంట్లోనే తీర్చిదిద్దుకునేలా బహుమతులూ వెంట తీసుకెళ్లొచ్చు. చేత్తో తయారు చేసిన బహుమతులు: ఓ చార్టును కట్ చేసి, మీ ఇంట్లోనే దొరికే పువ్వుల తోనో లేదా, బయటి నుంచి కొన్ని అరుదైన పుష్పాలు తెచ్చో ఓ గ్రీటింగ్ తయారు చేసి ఇవ్వండి. మీపై వారికున్న ప్రేమ రెండు రెట్లవుతుంది. పర్ఫ్యూమ్స్: ఓ మంచి సువాసనను ఇచ్చే పర్ఫ్యూమ్ ను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ఆభరణాలు: ఆభరణాలంటే, కేవలం బంగారమే కాదు. బంగారాన్ని కొనే స్తోమత లేకపోయినా, ఇమిటేషన్ జ్యూయలరీ అయినా సరే. ఓ గిఫ్ట్ ను భాగస్వామి చేతుల మీదుగా అందుకున్న అతివ ఆనందమే ఆనందం! ఫోటో ఫ్రేమ్స్: గతంలో మీరు కలసి తీయించుకున్న అందమైన చిత్రాన్ని మరింత అందమైన ఫోటో ఫ్రేమ్ లో పెట్టి కానుకగా ఇవ్వొచ్చు. దీని వల్ల ఆనాటి మధురానుభూతులు మరింత కాలం పాటు గుర్తొస్తూనే ఉంటాయనడంలో సందేహం లేదు. హ్యాండ్ బ్యాగ్, పర్స్: మీ జీవిత భాగస్వామికి మంచి హ్యాండ్ బ్యాగ్, లేదా అందమైన పర్స్ ను బహుమతిగా ఇచ్చి చూడండి. దాన్ని చేతుల్లో మోస్తున్న ప్రతిక్షణమూ మీరు గుర్తొస్తూనే ఉంటారనడంలో సందేహమా? స్వీట్స్: మీ జీవిత భాగస్వామికి లేదా కాబోయే భాగస్వామికీ నచ్చిన స్వీట్స్ ఏంటో తెలుసుకుని వాటిని గిఫ్ట్ గా ఇవ్వండి. అప్పటికి అవి అయిపోయినా, మీ ప్రేమ, అప్యాయతా జీవితాంతం గుర్తుండి పోతాయి. ఎరుపు గులాబీలు: వీటిని ఇష్టపడని యువతులు ఉండరు. ఓ ప్రత్యేక బహుమతిగా వీటిని ఇంటికి తీసుకెళ్లండి, ఆపై చూడండి! రొమాంటిక్ డిన్నర్: మీకు మాత్రమే సొంతమైన వారికి ఓ చక్కని సాయంత్రం, మంచి హోటల్ కు తీసుకెళ్లి, మెనూ నుంచి వారికి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి చూడండి. వారికి మీపై ఉన్న ప్రేమ మరింతగా పెరుగుతుంది. సంప్రదాయ చీరలు: ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరో మంచి చీరను బహుమతిగా ఇస్తే, అది వచ్చే కార్తీక పౌర్ణమినాటికి మీరిచ్చే బహుమతి కోసం జీవిత భాగస్వామి ఎదురుచూసేలా చేస్తుందనడంలో సందేహం లేదు.