: ఇకపై నెలకోసారి... మోదీ కీలక నిర్ణయం!
ఇండియాలో అన్ని అనుమతులూ పొంది పూర్తి కాని ప్రాజెక్టులపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. ఇకపై ప్రతి నెలా ఒక రోజు పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదో స్వయంగా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా రంగంలోకి దిగాలని మోదీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం మార్చి నుంచి 60 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.91 లక్షల కోట్లు) విలువైన ప్రాజెక్టులు చేపట్టగా, వాటిల్లో అత్యధికం పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టుల్లో పలు రోడ్లు, నౌకాశ్రయాలు, రైల్వేలు, పవర్ స్టేషన్లు తదితర ప్రాజెక్టులున్నాయి. నిధులు కేటాయించినా, అవి ఎందుకు పూర్తి కావడం లేదన్న విషయాన్ని పరిశీలించేందుకు మోదీ నెలకో మారు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షలు చేయనున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలతో ఈ సమీక్షలు చేయనున్న ఆయన, పూర్తికాని ప్రాజెక్టులపై అప్పటికప్పుడు నిర్ణయాలు ప్రకటించి, వాటి సత్వర పూర్తికి ఆదేశాలిస్తారని తెలుస్తోంది.