: త్వరగా భారత్ తరలించండి...ఇండోనేసియాలోని భారత్ కాన్సులేట్ కు చోటా రాజన్ లేఖ
మాఫియా డాన్ చోటా రాజన్ తాజాగా ఇండోనేసియాలోని భారత రాయబార కార్యాలయానికి ఓ లేఖ రాశాడు. బాలిలో తనకు ప్రాణ హాని ఉందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశాడు. వీలయినంత త్వరగా తనను భారత్ తరలించాలని కూడా అతడు భారత రాయబారిని వేడుకున్నాడు. ఆస్ట్రేలియా నగరం సిడ్నీ కేంద్రంగా కొంతకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న చోటా రాజన్ జింబాబ్వే వెళుతున్న క్రమంలో బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసుల చేతికి చిక్కాడు. ఈ క్రమంలో పలు కోణాల్లో విచారించేందుకు బాలి పోలీసులు కోర్టు అనుమతితో అతడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. బాలిలో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భావిస్తున్న చోటా రాజన్ అదే అంశాన్ని భారత రాయబార కార్యాలయానికి చేరవేశాడు. తనను తక్షణమే భారత్ కు తీసుకెళ్లండని కాన్సులేట్ కు రాసిన లేఖలో అతడు ప్రాధేయపడ్డాడు. మరి అతడి లేఖపై భారత రాయబార కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి.