: హైదరాబాదులో జోరందుకున్న బైక్ రేసులు... పాతబస్తీలో 200 మంది మైనర్ల అరెస్ట్
ఔటర్ రింగ్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు... గతుకులు లేని ఈ రోడ్లపై కుర్రకారు రేసింగ్ బైకులతో రివ్వున దూసుకెళ్లారు. ఈ క్రమంలో గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు మృత్యువాతపడ్డాడు. దీంతో ఈ రేసులపై దృష్టి సారించిన పోలీసులు యువతకు దాదాపుగా కళ్లెం వేశారు. మొన్నటికి మొన్న నెక్లెస్ రోడ్డుపై బైకు రేసుల్లో మునిగిన మైనారిటీ తీరని కుర్రాళ్లను పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. పోలీసుల తాకిడితో కొంతకాలం పాటు రేసింగ్ లకు స్వస్తి చెప్పిన కుర్రకారు తాజాగా తమ స్పాట్ ను పాతబస్తీకి మార్చేశారు. నిన్న రాత్రి పాతబస్తీలో కుర్రకారు బైకు రేసులతో వెర్రెత్తిపోయారు. పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తున్న వారి చెవులను చిల్లులు పడేలా చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 181 మంది కుర్రాళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి 202 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన కుర్రాళ్లలో మెజారిటీ పిల్లలు మైనర్లేనట!