: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషికి ఉరిశిక్ష


కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభానుకు ఉరిశిక్ష పడింది. ఈ మేరకు ముంబై సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. సుదీర్ఘ విచారణ అనంతరం మూడు రోజుల కిందటే చంద్రభానును ముంబై కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై అనూహ్య తండ్రి హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు. ముంబై టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అనూహ్య పనిచేసేది. క్రిస్మస్ కు ఇంటికి వచ్చిన ఆమె తిరిగి మచిలీపట్నం నుంచి ముంబై వెళుతూ గతేడాది జనవరి 5న ముంబై రైల్వేస్టేషన్ వద్ద అదృశ్యమైంది. ఈ క్రమంలో టాక్సీ డ్రైవర్ చంద్రభాను ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని, అత్యాచారం చేసి హతామర్చాడని తదనంతర పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే అతనికి ఉరిశిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజన్ థాక్రే కోర్టులో వాదించారు. రాజన్ వాదనతో ఏకీభవించిన కోర్టు దోషికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు ఇవాళ తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News