: బాహుబలిలో యుద్ధం ముందు 'సీన్'కు భారత సైన్యం స్వస్తి!
బాహుబలి సినిమా చూశారు కదా? అందులో కాలకేయుడితో యుద్ధానికి కదిలే ముందు భల్లాలదేవుడు చేసిన పని గుర్తుందా? ఓ దున్నపోతును అమ్మవారికి బలిస్తాడు కదా? ఆ వెంటనే బాహుబలి దాన్ని వ్యతిరేకించి తన రక్తంతో అమ్మవారికి తర్పణం చేస్తాడు. ఇకపై భారత సైన్యమూ బాహుబలి దారిలో నడవనుంది. అనాదిగా యుద్ధానికి వెళ్లేముందు విజయాన్ని కాంక్షిస్తూ, జంతువులను బలి ఇవ్వడం ఆనవాయతీ. భారత సైన్యం కూడా ఈ పని చేస్తుంటుంది. అయితే, ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో, ఇకపై సైన్యం జంతు బలులను ఆపివేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. గూర్ఖా రెజిమెంటులో ఈ తరహా బలులు సర్వసాధారణం కాగా, దున్నపోతు తలనరికి పూజలు చేయడాన్ని ఆపివేయాలని సైన్యం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని, గత దసరా సందర్భంగా సైన్యం దున్నపోతులను చంపలేదని ఎకనామిక్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. "ఇదో పాత సంప్రదాయం. ఇప్పటి భారత చట్టాలకు అది వ్యతిరేకం. ఓ జంతువును బలి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అందుకే సైన్యానికి ఆ ఆదేశాలిచ్చాం" అని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇది జీవహింసేనని భావించిన మీదటే, ఆ తరహా పూజలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా, జంతుబలి భారత సంస్కృతిలో సంప్రదాయంగా వస్తున్నందున దాన్ని అడ్డుకుని సెంటిమెంట్ ను దెబ్బతీయడం తగదని అంటున్న వారూ లేకపోలేదు.