: నాలుగేళ్లకే రూబిక్స్ క్యూబ్ చాంపియన్... చెన్నై చిన్నారి అద్భుత ప్రతిభ
శారదా అశోక్... చెన్నైలో నాలుగేళ్ల కిండర్ గార్టెన్ విద్యార్థిని. తన అద్భుత ప్రతిభతో కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో త్రీ లేయర్డ్ రూబిక్స్ క్యూబ్ ను అమర్చి చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆ పాప తండ్రి పేరు ఆర్.అశోక్, ఓ ఐటీ ఉద్యోగి. తన పాపను అతి త్వరలోనే 4 లేయర్డ్ రూబిక్స్ క్యూబ్ చాంపియన్ గా చూస్తానని ఆయన నమ్మకంతో చెబుతున్నారు. "క్యూబ్ సాల్వింగ్ లో చిన్న చిన్న మూవ్స్ చెబుతుంటే తాను ఆసక్తిగా గమనించడం చూశాను. ఆ తరువాత తన సొంత తెలివితో తొలుత 15 నిమిషాల్లో, ఆపై 5 నిమిషాల్లో సమస్యను సాల్వ్ చేసింది. ఇప్పుడు తనకు ఎన్నో షార్ట్ కట్స్ కూడా తెలుసు" అంటారు అశోక్. శారద చదువుతున్న స్కూల్ లో ఆమె ఓ స్టార్ ఇప్పుడు. కొద్ది రోజుల క్రితం నాలుగంటే నాలుగు నిమిషాల్లో ఆమె క్యూబ్ ను అమర్చిన విధానం చూసి హెడ్ మిస్ట్రెస్ అనితా డానియల్, "శారదకు ఎంతో తెలివితేటలున్నాయి. పాప ప్రదర్శన మా స్కూలుకే గర్వకారణం. శారద మరింత ఉన్నత స్థితికి వెళుతుంది" అన్నారు. ఇక భవిష్యత్తులో ఏమవుతావని శారదను ప్రశ్నిస్తే ఏమంటుందో తెలుసా? తనకు డాక్టర్ అవ్వాలన్నది కోరికట. ఆల్ ది బెస్ట్ శారద!