: టీడీపీకి అచ్చిరాని రాజ్యసభ...‘గుండు’ ఉదంతంతో గతాన్ని తవ్వుకుంటున్న పార్టీ నేతలు


దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంవీ మైసూరారెడ్డి, సి.రామచంద్రయ్య, యలమంచిలి శివాజీ, వంగా గీత ... తాజాగా గుండు సుధారాణి. విషయం చెప్పకుండా ఈ జాబితా ఏంటనేగా మీ అనుమానం? వీరంతా టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం పొందిన వారు. అంతేకాదండోయ్, పదవీ కాలం ముగియనున్న సమయంలో పార్టీకి గుడ్ బై చెప్పిన వారు కూడా. ఇక గుండు సుధారాణి కూడా తన రాజ్యసభ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో టీడీపీకి రాంరాం చెప్పేస్తున్నారు. వెరసి రాజ్యసభ సభ్యత్వం టీడీపీకి అచ్చి రాలేదని ఆ పార్టీ వర్గాలు మధనపడుతున్నాయి. పార్టీలో సీనియర్లుగా కొనసాగిన చంద్రబాబునాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన ఎంపీ పదవీ కాలం ముగుస్తుందనగా పార్టీని వీడారు. కడప జిల్లాకు చెందిన మైసూరా, రామచంద్రయ్యలు కూడా అదే బాటలో నడిచారు. ఇక శివాజీ, గీత సంగతి చెప్పక్కరలేదు. పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం పొందిన దివంగత నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ, ప్రస్తుతం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, చంద్రబాబు సన్నిహితులు సీఎం రమేశ్, సుజనా చౌదరిలు మాత్రమే పదవులతో సంబంధం లేకుండా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. గుండు సుధారాణి కీలక సమయంలో పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్న తరుణంలో టీడీపీ నేతలు తమ పార్టీ తరఫున రాజ్యసభ సీట్లు పొందిన వారందరినీ ఓ సారి గుర్తుకు తెచ్చుకుని మరీ బాధపడుతున్నారట.

  • Loading...

More Telugu News