: ఇక రష్యాకు అంత సీను లేదు: అమెరికా
దిగజారుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని 'సూపర్ పవర్' హోదా నుంచి దిగజార్చిందని, ప్రస్తుతం ఆ దేశం స్పెయిన్ కన్నా వెనుకబడి వుందని వైట్ హౌస్ వ్యాఖ్యానించింది. గతకాలపు సోవియట్ యూనియన్ తో పోలిస్తే ఇప్పటి రష్యా ప్రభావం నామమాత్రం కూడా లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ మీడియా సమావేశంలో తెలిపారు. "రష్యా ఇకపై అద్భుత శక్తిగల దేశం కాదు. గత కొద్ది వారాలుగా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ బలహీనం కాగా, ఇకపై మరింతగా పతనం కానుంది" అని ఆయన అన్నారు. ఇప్పుడాదేశం ప్రపంచంలోని 15వ అతిపెద్ద ఎకానమీగా మాత్రమే ఉంది. జపాన్ సముద్రంలో భాగంగా ఉన్న కొరియన్ పెనిన్సులా పరిధిలో రష్యా యుద్ధవిమానాల కదలికలను అమెరికా విమానాలు నిలువరించాయని ఆయన తెలిపారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని అడ్డుకునే చర్యలను రష్యా నిలిపి వేయాలని ఎర్నెస్ట్ హితవు పలికారు. ఉక్రెయిన్, సిరియా తదితర దేశాల విషయంలో అమెరికా, రష్యాల మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయంలో సందేహం లేదని అంగీకరించిన ఆయన, రష్యా వ్యవహార శైలిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.