: సిరిసిల్ల వర్సెస్ గుడిమళ్ల... ఓరుగల్లులో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల పోరు వీరి మధ్యే?
వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థి ఖరారుపై పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కూడా ఢిల్లీ నుంచి వచ్చి గాంధీ భవన్ లో అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో మంతనాలు సాగించారు. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు యత్నిస్తున్నా, ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడిన గుడిమళ్ల రవికుమార్ వైపు కేసీఆర్ దృష్టి సారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కేసీఆర్ నిన్న పరోక్షంగా రవికుమార్ అభ్యర్థిత్వానికే ఓటేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ ను బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం యత్నిస్తోంది. అయితే వివేక్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. పెద్దపల్లిని వదిలి వరంగల్ కు వచ్చేందుకు ఆయన ఏమాత్రం ఒప్పుకోవడం లేదట. దీంతో సిరిసిల్ల రాజయ్యను బరిలోకి దింపేందుకు దిగ్విజయ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. నిన్న పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించిన దిగ్విజయ్ సింగ్ నివేదికతో ఢిల్లీ వెళ్లారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత అధిష్ఠానం సిరిసిల్ల పేరును నేడు ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.