: తెలంగాణ సచివాలయంలో కీచక పర్వం...హోం మంత్రి పేషీ సమీపంలోనే మహిళ ఆత్మహత్యాయత్నం


తెలంగాణ సచివాలయంలో కీచకులు స్వైర విహారం చేస్తున్నారు. వీరి వేధింపులకు తాళలేక హౌస్ కీపింగ్ పనులు చేస్తున్న ఓ మహిళ నిన్న ఆత్మహత్యాయత్నం చేసింది. సచివాలయంలోని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కార్యాలయానికి అతి చేరువలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వివరాల్లోకెళితే... సెక్రటేరియట్ హౌస్ కీపింగ్ పనులను దక్కించుకున్న ఎస్ఆర్ కే సంస్థ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కొంతమంది మహిళలను నియమించుకుంది. ఈ క్రమంలో ఓ పేద మహిళ కూడా ఆ సంస్థ ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో చేరిపోయింది. తమ వద్ద పనిచేస్తున్న మహిళలపై సంస్థ సూపర్ వైజర్ ఎస్కే వలి అలియాస్ సైదులు, ఉద్యోగులు శేఖర్, కృష్ణ లు లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో నీలి చిత్రాలు చూపుతూ, సదరు చిత్రాల్లో ఉన్నట్లుగా తమతో గడపాలని బలవంతం చేశారు. ఈ క్రమంలో వారి వేధింపులకు తాళలేక ఓ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు స్పందించలేదట. ఫిర్యాదుల విషయం తెలుసుకున్న మృగాళ్లు మరింత రెచ్చిపోయారు. దీంతో ఓ మహిళ బొద్దింకల నివారిణి ‘హిట్’ ద్రవం తాగేసింది. నాయిని కార్యాలయం సమీపంలోనే ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది. విషయం గమనించిన అక్కడి వారు ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు కూడా ఏమాత్రం స్పందించలేదు. ప్రస్తుతం బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

  • Loading...

More Telugu News