: ‘గెలుపు’ వీరుడికి పరిమిత బాధ్యతలు...కేసీఆర్ నిర్ణయంతో షాక్ తిన్న టీఆర్ఎస్ నేతలు


తన్నీరు హరీశ్ రావు... టీఆర్ఎస్ లో కీలక నేతగానే కాక పార్టీ అధినేత కేసీఆర్ కు స్వయానా మేనల్లుడు. పూర్వాశ్రమంలో కేసీఆర్ వ్యవహారాలన్నీ ఆయన చిటికెలో చక్కబెట్టేవారు. ఇక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కేసీఆర్ ఎక్కడ ఎన్నికల బరిలోకి దిగినా, హరీశ్ దే హవా. ఇక మెదక్ జిల్లా సిద్దిపేటలో హరీశ్ రావు చెప్పిందే వేదం. సిద్దిపేట ప్రజలంతా ఆయన వెంటే. కడప జిల్లా పులివెందులలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సాధించిన రికార్డు మెజారిటీని బద్దలుకొట్టడం ఒక్క హరీశ్ కే సాధ్యమైంది. అలాంటి నేతకు వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలు అప్పగించారన్న సమాచారంతో విపక్షాలు బెంబేలెత్తిపోయాయి. అయితే, నిన్న సాయంత్రానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కాస్తంత ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే, హరీశ్ రావును వరంగల్ లోక్ సభ పరిధిలోని ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై విపక్షాలు లోలోపలే సంతోషం వ్యక్తం చేస్తుండగా, టీఆర్ఎస్ వర్గాలు మాత్రం షాక్ తిన్నాయి. అభ్యర్ధుల గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుని అహరహం శ్రమించే హరీశ్ రావుకు పరిమిత బాధ్యతలు అప్పగించడమేమిటన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను మాత్రం హరీశ్ కు అప్పగించిన కేసీఆర్, మిగిలిన ఆరు నియోజకవర్గాల బాధ్యతలను ఆరుగురు మంత్రులకు అప్పగించారు. వీరిలో తన కుమారుడు కేటీఆర్ కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. మరి వీరందరి మధ్య సమన్వయం ఏ మేరకు ప్రతిఫలిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News