: నివురుగప్పిన నిప్పులా ‘హోదా’ ఉద్యమం...ఎప్పుడైనా బద్దలవుతుంది: కారెం శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదలైన ఉద్యమం రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉందని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య కన్వీనర్ కారెం శివాజీ పేర్కొన్నారు. ఈ ఉద్యమం ఏ క్షణాన్నైనా ఉగ్రరూపం దాల్చవచ్చని ఆయన హెచ్చరించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలంతా వేచి చూశారని ఆయన నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని నోటి వెంట ప్రత్యేక హోదా మాట వినపడకపోవడంతో ప్రజలంతా తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఉద్యమం ఏ క్షణాన్నైనా బద్దలయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కాని పార్టీలకు ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన హెచ్చరించారు.