: అత్యాశతో వెళ్తే దేహశుద్ధి మిగిలింది!
అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందన్న విషయం చాలా మందికి తెలిసిందే. అయినా అలాంటి అత్యాశతోనే మహబూబ్ నగర్ జిల్లా అయిజకు వెళ్లిన కర్నూలు జిల్లా డోన్ కు చెందిన నలుగురు యువకులు తాము మోసపోయామన్న విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... డోన్ కు చెందిన బాబన్న, తిరుపతి, నరేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి లకు పది రోజుల నుంచి అత్యంత ఖరీదైన వజ్రాన్ని కేవలం పది లక్షల రూపాయలకే ఇస్తామని ఆగంతుకులు ఫోన్ చేస్తున్నారు. దానికి వారు స్పందించకపోవడంతో కొద్ది రోజుల తరువాత కేవలం 5 లక్షల రూపాయలకే ఆ వజ్రాన్ని ఇస్తామంటూ మళ్లీ ఫోన్ చేశారు. దీంతో ఆశపడిన ఆ నలుగురు యువకులు 5 లక్షల రూపాయలతో కారులో మహబూబ్ నగర్ జిల్లా అయిజకు వెళ్లారు. అప్పటికే అక్కడ వీరి కోసం ఎదురుచూస్తున్న సదరు ఆగంతుకులు వీరిని ఆపి, నలుగురికీ దేహశుద్ధి చేసి, నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో డోన్ యువకులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.