: మోదీ కథతో 'భజరంగీ భాయ్ జాన్-2': రాజ్ ఠాక్రే వ్యంగ్యం
ప్రధాని నరేంద్ర మోదీపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ దే విజయమని అన్నారు. బీహార్ లో బీజేపీ ఓటమిపాలవుతుందని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల ముందు మోదీకి, ఇప్పటి మోదీకి చాలా తేడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. నిత్యం విదేశీ పర్యటనల్లో మునిగి తేలుతున్న ప్రధాని మోదీని వెతికి తీసుకొచ్చే కథాంశంతో 'భజరంగీ భాయ్ జాన్-2' సినిమా ఉంటుందని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. కాగా, మూగ, బధిర బాలికను ఇంటికి చేర్చే కథగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసలు ఈ చిత్రానికి సీక్వెల్ వుంటుందో లేదో ఆ చిత్ర నిర్మాతలు ఇంతవరకు ప్రకటన చేయకున్నా ... రాజ్ ఠాక్రే మాత్రం ఇప్పుడు దీనిని మోదీకి ముడిపెట్టి, తమాషా వ్యంగ్య ప్రకటన చేయడం విశేషం!