: భార్యకు భరణంగా చిల్లరమూట పడేశాడు


భార్యకు భరణంగా ఇచ్చే డబ్బులను చిల్లర రూపంలో ఒక బ్యాగ్ లో కట్టుకొచ్చి, ఆ మొత్తాన్ని లెక్కపెట్టుకోమన్న వింత భర్తకు సంబంధించిన సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. పృథ్వీప్రజాపతి, రమీలాబెన్ భార్యభర్తలు. మనస్పర్థల కారణంగా వారిద్దరు 2011 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు నిర్వహణా ఖర్చుల కింద కొంత డబ్బును తన భర్త నుంచి ఇప్పించాలంటూ రమీలాబెన్ కోర్టులో పిటిషన్ వేసింది. తన భర్తకు సొంత వ్యాపారం ఉందని, అందుకోసం ఒక షోరూం కూడా ఏర్పాటు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణలో, తన భార్య చెప్పినట్లు తనకు ఎటువంటి షోరూం లేదని, తాను కేవలం అక్కడ ఒక ఉద్యోగిని మాత్రమేనని ప్రజాపతి కోర్టుకు విన్నవించాడు. విచారణ పూర్తయ్యాక, రమీలా బెన్ కు నిర్వహణా ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా రూ.1,500 ప్రజాపతి ఇవ్వాలంటూ జడ్జి తీర్పునిచ్చారు. 2014 నుంచి ప్రజాపతి తన భార్యకు పైసా కూడా చెల్లించలేదు. దీంతో, ఆ మొత్తాన్ని చెల్లించాల్సి రావడంతో పదివేల రూపాయల చిల్లర డబ్బులను బ్యాగ్ లో పట్టుకుని ప్రజాపతి వచ్చాడు. జడ్జి సమక్షంలో ఆ బ్యాగ్ ను భార్య ముందు పెట్టి లెక్కపెట్టుకోమన్నాడు. అయితే, అందుకు తిరస్కరించిన ఆమె ఆ బ్యాగ్ మాత్రం తీసుకుంది. తన దగ్గర డబ్బేమీ లేదంటున్నా సరే భరణం చెల్లించమన్నందుకు నిరసనగా అతనలా చిల్లర నాణేలు తెచ్చి ఉంటాడని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News