: వాళ్లు గల్లీల్లో లొల్లి చేశారు... మేం ఢిల్లీలో బిల్లు పెట్టించాం: సిరిసిల్ల రాజయ్య
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తనదైన శైలిలో టీఆర్ఎస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న సిరిసిల్ల రాజయ్య ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా తాము నిబద్ధతతో వ్యవహరిస్తామని ప్రకటించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని కూడా రాజయ్య వ్యాఖ్యానించారు. వరంగల్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నామన్నారు. టీఆర్ఎస్ తో పోలిస్తే మీ విజయావకాశాలెంత? అన్న ప్రశ్నకు ఆయన వేగంగా స్పందించారు. ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం వాళ్లు గల్లీల్లో లొల్లి చేశారు. మేము మాత్రం ఢిల్లీలో బిల్లు పెట్టించాం’’ అని రాజయ్య వ్యాఖ్యానించారు.