: లొంగిపోలేదు... భారత్ కు వస్తా: మీడియాతో చోటా రాజన్


ప్రత్యర్థుల చేతిలో నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పోలీసులకు స్వయంగా లొంగిపోయాడన్న వార్తలను మాఫియా డాన్ చోటా రాజన్ కొట్టిపారేశాడు. తాను లొంగిపోలేదని పేర్కొన్నాడు. కొంతకాలంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న చోటా రాజన్, జింబాబ్వేకు వెళుతున్న క్రమంలో బాలి ఎయిర్ పోర్టులో ఇండోనేసియా పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. భారత విదేశాంగ శాఖ మంత్రి వీకే సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పక్కాగా రచించిన ప్రణాళికలో భాగంగానే ఇండోనేసియా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారన్న వార్తలు వినిపించాయి. అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడి భుజం చోటా షకీల్ వరుస దాడుల నేపథ్యంలో అనుచర గణాన్నంతా కోల్పోయి ఏకాకిగా మారిన చోటా రాజన్, ప్రాణాలు కాపాడుకునేందుకు తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడన్న ప్రచారమూ సాగింది. ఈ నేపథ్యంలో నిన్న తమ అదుపులోని చోటా రాజన్ కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అతడిని బాలి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ముందుకు చొచ్చుకువచ్చిన మీడియా ప్రతినిధులతో చోటా రాజన్ రెండు ముక్కలు మాట్లాడాడు. తాను లొంగిపోయానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అతడు వ్యాఖ్యానించాడు. ఇక భారత్ పంపితే తనను చంపేస్తారని అతడు చేసిన వ్యాఖ్యల్లోనూ వాస్తవం లేదని తేలిపోయింది. తాను భారత్ కు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నానని చోటా రాజన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News