: బాత్ రూమ్ సింగర్స్ కు బెంగళూరు టెక్కీ ఛాన్స్... ప్రొఫెషనల్ గాయకులుగా మారుస్తున్న వైనం!
సంగీతం రాకపోయినా కాస్తంత రాగయుక్తంగా పాడగలిగే వారికి, తమ స్వరపాండిత్యాన్ని బాత్ రూంకే పరిమితం చేసుకుంటున్న వారికి ఓ లక్కీ ఛాన్స్. వీరి ప్రతిభను బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి బెంగళూరుకు చెందిన టెక్కీ సునీల్ కోశె నడుం బిగించాడు. ఆ క్రమంలో ఆయన చాలామంది బాత్ రూమ్ సింగర్లను ప్రొఫెషనల్ గాయకులుగా తీర్చదిద్దుతున్నారు. ఇందుకోసం ఆయన 'ఫ్రమ్ మగ్ టు మైక్' పేరుతో ఓ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో 200 వర్క్ షాప్ లు నిర్వహించి మూడువేల మంది గాయకులకు అవకాశం కల్పించారు. దాంతో వాళ్లంతా వేదికలు ఎక్కి ధైర్యంగా పాటలు పాడుతున్నారు. అంతేగాక చెన్నై, బెంగళూరు, కొచ్చి, త్రివేండ్రం వంటి నగరాల్లోని స్టూడియోల్లో తమ పాటలను రికార్డు చేసుకుని ఆనందపడుతున్నారు. దానిపై సునీల్ మాట్లాడుతూ, సంప్రదాయ గానాన్ని, ప్రొఫెషనల్ సింగింగ్ కు అనుసంధానం చేసి ఓ వేదిక కల్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. 20 నుంచి 25 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్నా చాలా మందికి స్టూడియోలో పాడే అవకాశం రావడం లేదన్నారు. స్టూడియోలో పాట రికార్డు చేస్తే తప్ప సొంత గొంతును మీరు అర్థం చేసుకోలేరంటున్నారాయన. వేదికపై పాడటం వేరు, స్టూడియోలో మైక్రోఫోన్ ఎదుట పాడటం వేరని, గొంతులో చిన్న మార్పు వచ్చినా స్టూడియోలో అర్థమైపోతుందని సునీల్ వివరిస్తున్నారు. ఇటీవల ఆయన తన విద్యార్థులతో కలసి ఓ వీడియోను కూడా రూపొందించారు.