: కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...నాడు కేంద్ర మంత్రి హోదాలో ఏకపక్ష నిర్ణయాలపై కూపీ లాగుతున్న సీబీఐ


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఉచ్చు బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వెలుగు చూసిన వెలుగుబంటి సూర్యనారాయణ అక్రమాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఇటీవల సీబీఐ అధికారులు కేసీఆర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలోనే విచారించారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఆ సంస్థ పలు సంచలన అంశాలను వెల్లడి చేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కేసీఆర్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు ఆ సంస్థ అధికారులు దాదాపుగా నిర్ధారించారు. సహారా గ్రూపు లాంటి వివాదాస్పద కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించిన కేసీఆర్... దేశంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా ఆయా కంపెనీలు సొంతంగా ‘భవిష్య నిధి(పీఎఫ్)’ని నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఉన్న కార్మిక శాఖ మాజీ కార్యదర్శి సాహ్ని రూపొందించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేసేశారట. దీంతో సహారా గ్రూపు తన ఉద్యోగులకు సంబంధించి సొంతంగా పీఎఫ్ ఖాతాలను నిర్వహించింది. ఈ క్రమంలో ఆ కంపెనీ ఉద్యోగులు భారీ ఎత్తున నష్టపోయారని కూడా సీబీఐ వాదిస్తోంది. కేంద్ర మంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్న అసాధారణ, అనుచిత నిర్ణయాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయని కూడా ఆ సంస్థ భావిస్తోంది. కంపెనీల సొంత పీఎఫ్ నిర్వహణపై నాడు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ అభ్యంతరం చెప్పినా, కేసీఆర్ బేఖాతరు చేశారట. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఓ వైపు సీబీఐ కాస్తంత లోతుగా దర్యాప్తు చేస్తోంటే, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలోని గుట్టును తవ్వి తీసేందుకు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని రంగంలోకి దింపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వెరసి మున్ముందు కేసీఆర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదన్న భావన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News