: ఏడాదిలో 281 మంది ఆకతాయిల ఆటకట్టించాం: స్వాతి లక్రా
హైదరాబాదు నగరంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసి నేటికి ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో షీటీమ్స్ పనితీరుపై హైదరాబాదు అదనపు కమిషనర్ స్వాతి లక్రా మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా షీటీమ్స్ ఏడాదిలో గణనీయమైన పనితీరు కనబరిచాయని ప్రశంసించారు. ఈ ఏడాదిలో షీటీమ్స్ కు 883 ఫిర్యాదులందాయని ఆమె చెప్పారు. మొత్తం 281 మంది ఆకతాయిలను అరెస్టు చేశామని ఆమె వెల్లడించారు. వారిలో 12 మందిపై నిర్భయ చట్టంపై కేసులు నమోదు చేశామని చెప్పారు. 19 మందికి జైలు శిక్ష పడగా, 101 మందికి కోర్టులు జరిమానా విధించాయని ఆమె వెల్లడించారు. కొంత మందిని హెచ్చరించి విడిచిపెట్టామని ఆమె తెలిపారు. షీటీమ్స్ మహిళల్లో ధైర్యాన్ని తెచ్చాయని ఆమె వివరించారు.