: వరంగల్ లో 200 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం: భన్వర్ లాల్
వరంగల్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వరంగల్ ఉప ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లకు 28 కంపెనీల కేంద్ర బలగాలను కోరినట్టు తెలిపారు. వరంగల్ లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ పత్రంపై విధిగా ఫోటో ఉండేలా చూడాలని అన్నారు. ఉపఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం 35 టీములను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 23 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్ నుంచి కాని, లేక వరంగల్ కు కాని భారీ ఎత్తున నగదు, నగలు తీసుకువచ్చేవారు అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 1,571 బూత్ లలో 200 బూత్ లు సమస్యాత్మకమని, వాటికి ప్రత్యేక భద్రత కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.