: భారతీయ దంపతులకు మాత్రమే 'సరోగసీ' అనుమతి: కేంద్ర ప్రభుత్వం


దేశంలో సరోగసీ విధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని వెల్లడించింది. ఈ విధానాన్ని కేవలం భారతీయ దంపతులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నేడు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. కమర్షియల్ సరోగసీని ప్రభుత్వం అనుమతించబోదని, భారత్ లో విదేశీయులకు సరోగసి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అంతేగాక కమర్షియల్ సరోగసి కోసం అండం దిగుమతి చేసుకోవడంపైనా నిషేధం విధిస్తున్నట్టు కేంద్రం వివరించింది. అయితే పరిశోధనల కోసం వినియోగించే వాటిపై ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. అలాగే అద్దెగర్భం ద్వారా జన్మించిన వికలాంగ శిశువులను తీసుకునేందుకు నిరాకరించే దంపతులకు జరిమానా విధించాలని భావిస్తున్నట్టు పేర్కొంది. సరోగసి విధానాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా చేసేందుకు రూపొందించిన ముసాయిదాను రాష్ట్రాలకు పంపినట్టు వెల్లడించింది. అద్దెగర్భం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు, కమర్షియల్ సరోగసీని నియంత్రించేందుకు సమగ్ర చట్టం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. దానిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 24కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News