: బాలయ్యా! ఇప్పటికే ‘హోదా’ పొందిన రాష్ట్రాలను చూసి మాట్లాడు!: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు


ఏపీలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు సర్కారుపై బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహావేశం కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంశాలపై సోము వీర్రాజు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదాపై ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో పరిశీలించిన తర్వాత బాలయ్య మాట్లాడితే బాగుంటుందని వీర్రాజు అన్నారు. అంతేకాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్ కు ప్రధాని సిఫారసు చేసిన విషయం బాలయ్యకు తెలియదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసే వారిపై అక్కడికక్కడే కేసులు నమోదు చేస్తున్న ఏపీ సర్కారు, ప్రధాని దిష్టిబొమ్మల దహనంపై మాత్రం అంటీముట్టనట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News