: విడిచిపెట్టండి ప్లీజ్...భారత్ కు పంపితే నన్ను చంపేస్తారు: ఇండోనేసియా పోలీసులకు చోటా రాజన్ విజ్ఞప్తి
20 ఏళ్ల వేట తర్వాత పోలీసులకు పట్టుబడ్డ మాఫియా డాన్ చోటా రాజన్ చావు భయంతో బెంబేలెత్తిపోతున్నాడట. ఇండోనేసియా పోలీసుల విచారణలో భాగంగా తానేమీ భయపడటం లేదని చోటా రాజన్ వ్యాఖ్యానించాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. చోటా రాజన్ ను విచారిస్తున్న బాలి పోలీస్ కమిషనర్ రీయిన్ హార్డ్ నాయింగోలన్ ఈ మేరకు వెల్లడించారు. భారత న్యూస్ చానెల్ ఎన్డీటీవీతో మాట్లాడిన నాయింగోలన్ తమ విచారణలో చోటా రాజన్ వ్యవహార సరళిని పూర్తి స్థాయిలో వెల్లడించారు. భారత్ పంపితే, తనను చంపేస్తారని గడగడలాడుతున్న చోటా రాజన్ తనను విడిచిపెట్టాలని కాళ్లా వేళ్లా పడుతున్నాడని నాయింగోలన్ పేర్కొన్నారు. తనను విడిచిపెడితే జింబాబ్వే పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటానని కూడా రాజన్ ప్రాధేయపడుతున్నాడని కూడా ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా నుంచి జింబాబ్వే పారిపోయే క్రమంలోనే అతడు బాలి వచ్చి తమ చేతికి చిక్కాడని ఆయన వెల్లడించారు. ఊహించని విధంగా తమకు పట్టుబడ్డ చోటా రాజన్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, సిగరెట్లపై సిగరెట్లు ఊదేస్తున్నాడని కూడా నాయింగోలన్ చెప్పారు.