: లంచం కేసులో తహశీల్దార్ కు మూడేళ్ళ జైలు శిక్ష
తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల తహశీల్దార్ నాగేశ్వరరావు లంచం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2007 నవంబర్ వరకు ఉద్యోగంలో పనిచేసిన ఆయనకు అవినీతికి పాల్పడిన వ్యవహారంలో మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.60వేల జరిమానా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే... కపిలేశ్వరపురం మండలం వోడపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రామారావు, పేరిరాజులు అనే వ్యక్తులకు పూర్వీకుల నుంచి లంక భూములున్నాయి. కొంతమంది వ్యక్తులు ఆ భూమిని ఆక్రమంగా సాగుచేసేందుకు ప్రయత్నిస్తుండటంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అక్రమంగా సాగు చేసుకోవాలనుకున్న వారికి తహశీల్దార్ నాగేశ్వరరావు అండగా నిలిచారు. దాంతో బాధితులు హైకోర్టుకు వెళ్లారు. స్పందించిన కోర్టు విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఈ బాధ్యతలను సదరు తహశీల్దార్ కే కలెక్టర్ అప్పగించారు. ఈ క్రమంలో మీకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని తహశీల్దార్ డిమాండ్ చేశాడు. దాంతో బాధితులు రాజమండ్రి రేంజి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహశీల్దార్ లంచం తీసుకోబోతుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు.