: మీకేంటి కేసీఆర్ జీ!... తెలంగాణ ధనిక రాష్ట్రం కదా?: అరుణ్ జైట్లీ వ్యాఖ్య
‘‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. రుణ పరిమితి పెంచండి’’ అంటూ కేంద్రాన్ని అర్థించిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిన్న షాక్ తగిలింది. ఆప్యాయంగా పలకరిస్తూనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరాచికాలు ఆడారు. ‘‘మీకేంటి కేసీఆర్ జీ!...తెలంగాణ ధనిక రాష్ట్రం కదా? అప్పు పెంచుకోవడం ఎందుకు? ఆ వెసులుబాటు ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకే. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణకు ఎఫ్ఆర్ బీఎం సడలింపు ఇవ్వడం సాధ్యపడదే!’’ అంటూ కేసీఆర్ ముఖం మీదే జైట్లీ చెప్పేశారు. దీంతో ఎన్నో ఆశలతో ఢిల్లీలో కాలు మోపిన కేసీఆర్ కు తొలిరోజు తొలి భేటీలోనే షాక్ తగిలినట్టైంది. అయితే ఆ వెంటనే తేరుకున్న కేసీఆర్ కూడా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను ఏకరువు పెడుతూ జైట్లీ వాదనకు దీటుగానే సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నో వినూత్న పథకాలు చేపడుతున్నామని చెప్పిన కేసీఆర్, విదేశీ రుణం పొందేందుకు అవకాశం కల్పించాలని కోరారు. బ్రిక్స్ బ్యాంకు రాష్ట్రానికి అప్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. అయినా దివాలా తీసిన రాష్ట్రాలకు అప్పు ఇచ్చేందుకు భయపడాలి కానీ, ఆర్థికంగా బలంగా ఉన్న తమ విషయంలో నిబంధనల సడలింపునకు ఇబ్బందులేమిటని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అంతేకాక ఇదే విషయాన్ని 14వ ఆర్థిక సంఘం చెబుతోంది కదా? అని కూడా కేసీఆర్ వాదించారు. దీంతో కాస్తంత సర్దుకున్న అరుణ్ జైట్లీ వ్యయ విభాగం అధికారులతో చర్చించి తాను తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.