: తెలంగాణ ప్రత్యేక ప్రతినిధుల మధ్య ‘కారు’ చిచ్చు... సాహ్నికి తన బుగ్గ కారివ్వడంపై భగ్గుమన్న సముద్రాల
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధుల మధ్య అగ్గి రాజేసింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాహ్నిని కూడా ఆ తర్వాత ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. మొన్నటిదాకా తెర వెనుకే ఉన్న సాహ్ని, నిన్నటి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో తెర ముందుకు వచ్చారు. దీంతో అప్పటిదాకా వేణుగోపాలాచారికి ప్రభుత్వం కేటాయించిన బుగ్గ కారును తెలంగాణ భవన్ అధికారులు సాహ్నికి బదిలీ చేశారు. వేణుగోపాలాచారికి మాత్రం ప్రైవేట్ కారును ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న వేణుగోపాలాచారి అధికారుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కారు సాహ్నికి ఎట్లిస్తరు?’ అంటూ ఆయన అధికారులను నిలదీశారు. దీంతో సమాధానం చెప్పలేక అధికారులు తంటాలు పడ్డారు.