: థియేటర్ గేట్ మెన్ తో రాజ్ తరుణ్ కి వింత అనుభవం!
ఇటీవల వచ్చిన 'సినిమా చూపిస్త మావా' చిత్రంతో బిజీ హీరోగా మారిన రాజ్ తరుణ్ విశాఖపట్నంకు చెందిన కుర్రాడు. చిన్నప్పటి నుంచీ అతనికి సినిమాల పిచ్చి వుంది. అక్కడి గోపాలపట్నంలోని సుకన్య ధియేటర్ లో రెగ్యులర్ గా సినిమాలు చూసేవాడు. అక్కడ రిలీజయ్యే ఏ సినిమాని వదిలేవాడు కాదనే చెప్పచ్చు. టికెట్ల కోసం ఆ ధియేటర్ గేట్ మెన్ తో ఎప్పుడూ గొడవ పడేవాడట. ఆ సమయంలో ఆ గేట్ మెన్ మన రాజ్ తరుణ్ ను 'టికెట్లు లేవు, గిక్కెట్లు లేవు, వెళ్ళు వెళ్ళు...' అంటూ ఎప్పుడూ బయటకు వెళ్ళగొట్టేసేవాడట. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు తను సినిమా హీరో! 'సినిమా చూపిస్త మావ' సినిమా విజయ యాత్రలో భాగంగా అదే వైజాగ్ లోని అదే సుకన్య ధియేటర్ కు రాజ్ వెళ్ళాడు. ఇతన్ని చూడగానే ఆ గేట్ మన్ నవ్వుతూ 'రండి రండి' అంటూ ఘనంగా ఆహ్వానించాడు. దీంతో 'అప్పుడు తరిమేసేవారు...ఇప్పుడేంటి రండి రండి అంటున్నారు?' అంటూ రాజ్ తరుణ్ అతనితో సరదాగా పరాచకాలాడాడు. ఈ విషయం గురించి రాజ్ తరుణ్ చెబుతూ, 'ఏమైనా ఆ రోజులు బాగుండే'వని గుర్తు చేసుకున్నాడు.