: చెన్నై విమానాశ్రయంలో టీ వ్యాపారుల మధ్య ఘర్షణ ... ఒకరి హత్య
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చెన్నై విమానాశ్రయంలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... తాంబరం ప్రాంతానికి చెందిన రవి విమానాశ్రయంలో టీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆవడి ప్రాంతానికి చెందిన కార్తికేయన్ కూడా అక్కడే టీ వ్యాపారం చేస్తున్నాడు. వీరి మధ్య వృత్తిపరమైన విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం పార్కింగ్ విషయంలో చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ పెద్దది కావడంతో కార్తికేయన్ కత్తితో రవిని పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రవి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. దీంతో విమానాశ్రయాధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, కార్తికేయన్ ను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.