: రాజకీయాల్లోకి రావడమంత బుద్ధితక్కువ పని లేదంటున్న సినీ నటుడు
రాజకీయాల్లోకి రావడమంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ, అమెరికా రాజకీయాలపై ఆసక్తి చూపే జార్జ్ క్లూనీని చాలా మంది రాజకీయాల్లోకి రావాలని కోరుతుంటారు. తాజాగా ఆయనను పలువురు అభిమానులు రాజకీయాల్లోకి రావాలని కోరారు. 'రాజకీయాలకు ఓపిక, శ్రద్ధ చాలా అవసరం. నాకు అంత ఓపిక, శ్రద్ధ ఉన్నాయని భావించడం లేదు' అంటూ సమాధానం చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేసే జార్జ్ క్లూనీ 2008, 2012లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామకు మద్దతు పలికాడు. సూడాన్ లో రాజకీయ కల్లోలం రేగకుండా ఎప్పుడో చెక్ పెట్టాల్సిందని ఒబామాకు నేరుగా సూచించాడు క్లూనీ. అమెరికాలో ఒబామా కంటే మెరుగైన రాజనీతిజ్ఞుడు ప్రస్తుతానికి ఉన్నాడని తాను భావించడం లేదని ఆయన స్పష్టం చేశాడు. కాగా, ఆయన భార్య అమాల్ అలావుద్దీన్ మానవ హక్కుల ఉద్యమకారిణి కావడం విశేషం. జార్జ్ క్లూనీ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.