: హ్యాపీ బర్త్ డే టూ మాస్టర్ బ్లాస్టర్!


క్రికెట్ డిక్షనరీలో రికార్డుల రారాజుగా సచిన్ టెండుల్కర్ పేరు ప్రముఖంగా కనిపిస్తుంది. నేటి వరకూ 198 టెస్టులు, 463 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచులాడిన మాస్టర్ టెండుల్కర్ ఎన్నో రికార్డులను తన పేజీలో రాసుకున్నాడు. 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన సచిన్ రమేశ్ టెండుల్కర్ నేడు 40వ పడిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సచిన్ కు బర్త్ డే విషెస్ చెబుదాం.

1989లో 16ఏళ్ల వయసుకే తొలిసారిగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా సచిన్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ ఆరంభించాడు. పిన్న వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగిడడం ఒక రికార్డ్. నేటి వరకూ 34,273 పరుగులు చేసి అటు వన్డేల్లోనూ, ఇటు టెస్టుల్లోనూ అత్యధిక పరుగుల క్రికెటర్ గా రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికీ సచిన్ ఇంకా టెస్ట్ క్రికెట్ లో కొనసాగుతూనే ఉన్నాడు. ఎక్కువ మ్యాన్ ఆఫ్ మ్యాచ్, మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డులు, ఎక్కువ సార్లు 90 పరుగులు చేసిన క్రికెటర్, వరల్డ్ కప్ లలో అత్యధిక పరుగుల వీరుడు(2560), 1988లో హారిస్ షీల్డ్ గేమ్ లో తన చిన్ననాటి మిత్రుడు వినోద్ కాంబ్లితో కలిసి చేసిన 664 పరుగుల భాగస్వామ్యం, 1999లో న్యూజిలాండ్ పై ద్రవిడితో కలిసి సృష్టించిన 331 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం... ఇలా ఎన్నో రికార్డులు సచిన్ పుస్తకంలో కనిపిస్తాయి.

ఇప్పడు సచిన్ పుస్తకంలో మరో రికార్డ్ వచ్చి చేరింది. 40ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్న వీరుడిగా ఘనతను సొంతం చేసుకున్నాడు. 40వ పడిలో ఆడిన రికార్డ్ చివరిగా 1959లో భారత క్రికెటర్ వినూ మన్ కాద్ పేరిట ఉంది. ఆ తర్వాత ఇన్నేళ్లలో ఆ రికార్డును సచినే సొంతం చేసుకోగలిగాడు. శభాష్ మాస్టర్!

  • Loading...

More Telugu News