: వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్తించడం లేదు... చంద్రబాబుకు రేవంత్ ఫిర్యాదు
రెండు రోజుల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి, ఉపనేత రేవంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం నిజమేనని తేలిపోయింది. నేటి ఉదయం విజయవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీ టీడీపీ నేతలు తనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్తించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని కూడా రేవంత్ రెడ్డి మొరపెట్టుకున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ పై ఉమ్మడి పోరు సాగిద్దామన్న తన వాదనకు ఏ ఒక్కరు మద్దతు పలకడం లేదని కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని విషయాలను చంద్రబాబు సావధానంగా విన్నారు. సమస్య మరింత పెద్దది కాకుండా చూడాలని, ఈ మేరకు తాను మిగిలిన నేతలతో మాట్లాడతానని రేవంత్ రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.