: దొనకొండలో రాజధాని వస్తుందని జగన్ ఆశ పడ్డారు: మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్య
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో నిర్మితం కావడం ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా దొనకొండలోనో, లేక తన సొంత జిల్లా కడపలోనో రాజధాని ఏర్పాటవుతుందని జగన్ ఆశపడ్డారని ఆయన అన్నారు. అయితే జగన్ ఆశలకు విరుద్ధంగా తుళ్లూరు పరిధిలో రాజధాని ఏర్పాటవుతుండటంతో రాజధాని అభివృద్ధిని అడ్డుకునేలా జగన్ వ్యవహరిస్తున్నారని ప్రత్తిపాటి ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం గుంటూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ప్రత్తిపాటి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దొనకొండలోనో, కడపలోనో రాజధాని వస్తే తన భూములకు మంచి రేటు వస్తుందని జగన్ ఆశపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాజధానికి తుళ్లూరు ప్రాంతం ఎంపిక కావడంతో జగన్ ఆశలు అడియాశలు అయ్యాయని ప్రత్తిపాటి అన్నారు.