: లోకాస్ట్-హైరేంజ్, ఇండిగోలో వాటా కావాలా?... 29లోగా కొనుక్కోవచ్చు!
తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని అందిస్తూ, దాదాపు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తూ, లాభాల్లో దూసుకెళ్తున్న ఎయిర్ లైన్స్ ఇండిగో ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) మార్కెట్ ను తాకింది. సుమారు రూ. 3 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సంస్థ వాటాల విక్రయాన్ని ప్రకటించగా, అక్టోబర్ 29తో ఐపీఓ ముగియనుంది. రూ. 10 ముఖ విలువ ఉన్న వాటాకు ప్రైస్ బ్యాండ్ రూ. 700 నుంచి రూ. 765 మధ్య ఉండనుంది. ఈ విలువ ప్రకారం ఇండిగో మార్కెట్ వాల్యూ ఐపీఓ అనంతరం ఒక్కసారిగా రూ. 26 వేల కోట్లకు చేరుతుంది. వాటాల విక్రయం తరువాత ప్రమోటర్ల వాటా 93 శాతం నుంచి 85 శాతానికి తగ్గుతుంది. 2012 తరువాత భారత స్టాక్ మార్కెట్ ను తాకిన అతిపెద్ద ఐపీఓ ఇదే కావడం గమనార్హం. వ్యాపారవేత్త రాహుల్ భాటియా, యూఎస్ ఎయిర్ వేస్ గ్రూప్ మాజీ సీఈఓ రాకేష్ గంగ్వాల్ లు సంయుక్తంగా 2006లో ఇండిగో సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రస్తుతం రూ. 3,912 కోట్ల అప్పులున్నాయి. ఇవన్నీ విమానాల కొనుగోళ్ల అనంతరం తయారీ సంస్థలకు చెల్లించాల్సిన మొత్తమని సంస్థ పేర్కొంది. ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.