: చోటా రాజన్ ను చంపడం కుదర్లేదు... అందుకే పట్టించాను!: చోటా షకీల్ ప్రకటన


మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్టుపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు భారత పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగించిన చోటా రాజన్ రెండు రోజుల క్రితం ఇండోనేసియా పోలీసులకు బాలిలో పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ పై పలు కథనాలు వెలువడ్డాయి. చోటా రాజన్ అరెస్ట్ లో భారత మాజీ ఆర్మీ చీఫ్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కీలక భూమిక పోషించారని తొలుత కథనాలు వెలువడ్డాయి. చోటా రాజన్ అరెస్ట్ కు రెండు రోజుల ముందు ఆస్ట్రేలియా వెళ్లిన వీకే సింగ్ అతడి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఇండోనేసియా పోలీసులకు సమాచారమిచ్చి చోటా పట్టుబడేలా చేశారని తెలుస్తోంది. అయితే చోటా రాజన్ అరెస్ట్ లో తానే కీలకమని మరో మాఫియా డాన్ చోటా షకీల్ చెబుతున్నాడు. తనకు బద్ధ శత్రువుగా ఉన్న చోటా రాజన్ ను చంపేసేందుకు చాలా సార్లు తాను యత్నించానని షకీల్ చెప్పాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కుడిభుజంలా ఉన్న చోటా షకీల్ గతంలో చోటా రాజన్ ను మట్టుబెట్టేందుకు పలుమార్లు పక్కాగా ప్లాన్ వేశాడు. గతంలో రాజన్ పై జరిగిన అన్ని దాడులు కూడా షకీల్ కనుసన్నల్లోనే జరిగాయట. వారం క్రితం కూడా ఫిజీలో రాజన్ పై షకీల్ దాడి చేయించాడు. అయితే ఈ దాడి నుంచి కూడా రాజన్ క్షేమంగా బయటపడ్డాడు. ఇక లాభం లేదనుకుని ఇండోనేసియాకు రాజన్ పారిపోతున్న విషయాన్ని తెలుసుకున్న షకీల్ పోలీసులకు సమాచారం చేరవేశాడట. తానిచ్చిన సమాచారంతోనే ఇండోనేసియా పోలీసులు రాజన్ ను అరెస్ట్ చేశారని షకీల్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News