: టీడీపీకి ‘గుండు’ గుడ్ బై?...టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తో రాజ్యసభ మెంబర్ సుధారాణి భేటీ
తెలంగాణలో ‘గులాబీ ఆకర్ష్’ పథకం ఇంకా కొనసాగుతున్నట్లే ఉంది. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ టికెట్లపై గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పలువురు నేతలు ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల సందర్భంగా ఆ పార్టీలకు చెందిన పలువురు నేతలు ‘కారు’ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి నిన్న టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తో భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక కోసం కాకపోయినా, త్వరలోనే వరంగల్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరేందుకు గుండు సుధారాణి ఆసక్తి చూపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె వినోద్ కుమార్ తో భేటీ అయ్యారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేసీఆర్ హైదరాబాదు తిరిగి రాగానే సుధారాణి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, వైసీపీలో ముఖ్య నేతగా కొనసాగిన మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.