: చిత్తుగా ఓడినా టీమిండియా ర్యాంకు పదిలం... రెండో స్థానానికి ఎగబాకిన కోహ్లీ


ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్ లలో టీమిండియా చిత్తుగా ఓడింది. టీ20తో పాటు వన్డే టైటిల్ ను పర్యాటక జట్టుకు అప్పనంగా అప్పజెప్పింది. రెండు టీ20లు జరగ్గా రెంటిలోనూ ఓటమి పాలైన టీమిండియా, ఐదు వన్డేల్లో రెండింటిలో మాత్రమే నెగ్గింది. మిగిలిన మూడింటిలో చిత్తుగా ఓడి టైటిల్ ను ప్రత్యర్థి చేతుల్లో పెట్టేసింది. ఇంత చెత్త ప్రదర్శన కనబరచినా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ర్యాంకు మాత్రం చెక్కుచెదరలేదు. సిరీస్ కు ముందు రెండో స్థానంలో ఉన్న టీమిండియా ఆ తర్వాత కూడా అదే స్థానంలో కొనసాగుతోంది. ఘోర పరాభవం కారణంగా ఏకంగా ఏడు రేటింగ్ పాయింట్లు కోల్పోయినా, టీమిండియా ఇంకా రెండో స్థానంలోనే కొనసాగుతున్నట్లు ఐసీసీ నిన్న ప్రకటించింది. ఇక టీమిండియాను చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా మాత్రం మూడో స్థానంలోనే ఉండిపోయింది. ఇరు జట్లకు రెండు రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. 114 పాయింట్లో టీమిండియా రెండో స్థానంలో ఉండగా, 112 పాయింట్లతో సఫారీలు మూడో స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా (127 పాయింట్లు) కొనసాగుతోంది. ఇక బ్యాటింగ్ విభాగంలోకి వస్తే, టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్ లలో సత్తా చాటాడు. తత్ఫలితంగా మూడో ర్యాంకు నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకాడు. ఇక వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా బౌలింగ్ ను తుత్తునియలు చేసిన సఫారీ వన్డే జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మునుపటిలాగే టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

  • Loading...

More Telugu News