: ఇప్పటికీ బాధిస్తున్న 43 ఏళ్ల నాటి యుద్ధ గాయాలు!
జూన్ 7, 1972వ సంవత్సరంలో దక్షిణ వియత్నాంలోని ట్రాంగ్ బ్యాంగ్ గ్రామంపై యుద్ధ సేనలు నాపమ్ బాంబును ప్రయోగించాయి. ఆ బాంబు ప్రభావంతో ఒళ్లంతా మంటలు పుట్టడంతో తన ఒంటిపై ఉన్న దుస్తులను తీసేసి వీధిలోకి పరుగులెత్తింది తొమ్మిదేళ్ల పాప కిమ్ ఫూన. ఆ గాయాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కాలిన గాయాల బాధను మొన్నటి వరకూ భరిస్తూ వచ్చిన కిమ్ ఫూన ప్రస్తుత వయస్సు 52. ఆ బాధను తట్టుకోవడం ఇక ఆమె వల్ల కాలేదు. దీంతో అమెరికాలోని మయామి ఆసుపత్రిలో చేరి కాలిన గాయాలకు చికిత్స చేయించుకుంటోంది. నాటి బాంబు దాడిలో ఆమె ఎడమ చేయి, భుజానికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాల బాధ నుంచి బయటపడేందుకని ఎన్నో ఆసుపత్రులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. కేవలం ఎక్సైర్ సైజ్ చేయడం ద్వారా మాత్రమే గాయాల బాధ నుంచి ఉపశమనం లభిస్తుందని వారు చెప్పారు తప్పా, అంతకు మించి ఏమీ చేయలేదని కిమ్ ఫూన చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యులు చెప్పిన నియమాలను పాటిస్తున్నప్పటికీ గాయాల బాధ నుంచి మాత్రం బయటపడలేకపోతున్నానని ఆమె పేర్కొంది. అమెరికాలోని మయామి డెర్మటాలజీ లేజర్ ఇనిస్టిట్యూట్ లో సరైన చికిత్స అందిస్తారని తెలియడంతో ఇప్పుడు ఇక్కడ చేరినట్లు ఆమె చెప్పింది. తన భర్త బీయూ తొయూన్, మరో అంకుల్ సహాయంతోనే ఈ ఆసుపత్రిలో చేరానంది. ‘నేను చనిపోతేనే కాలిన గాయాల బాధ నుంచి నాకు విముక్తి లభిస్తుందనుకున్నా. కానీ, ఈ ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక ఏడాదిలో కోలుకుంటానని భావిస్తున్నాను’ అని కెనడాలోని టొరంటాలో నివసిస్తున్న కిమ్ ఫూన అభిప్రాయపడింది. అన్నట్టు, ఆమెకు ఇద్దరు పిల్లలు. కాగా, నాటి యుద్ధ సమయంలో తీసిన ఫొటోకు పులిట్జర్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఆ ఫొటో తీసిన నిక్ ఉట్ ప్రస్తుత వయస్సు 65 సంవత్సరాలు.