: బీహార్ లో జర్నలిస్టు కాల్చివేత
బీహార్ లోని కస్తా గ్రామంలో జర్నలిస్టు మితిలేష్ పాండే(40)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. స్థానిక దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్న మితిలేష్ ఇంటికి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు రాత్రి సమయంలో వెళ్లారు. ముసుగులు ధరించి ఉన్న ఆ ముగ్గురు మితిలేష్ పై కాల్పులు జరిపారు. దీంతో శబ్దం రావడంతో ఆరు బయట పడుకుని ఉన్న మితిలేష్ బంధువు ఉమేష్ కుమార్ పాండేకు మెలకువ వచ్చింది. గదిలోకి వెళ్లే చూసే సరికి మితిలేష్ రక్తపుమడుగులో పడి కొట్టుకుంటున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోపే అతని ప్రాణాలు పోయాయని ఉమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, మితిలేష్ ను చంపేస్తామంటూ గతంలోనే బెదిరింపులు వచ్చాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని మితిలేష్ బంధువు ఆరోపించాడు.