: 'నీ రేటెంత?' అని అడిగిన పోకిరీలను వెంటాడి పట్టుకున్న ముంబై మోడల్
ముంబై మోడల్ పూర్ణిమ (26). రోజువారీ జాగింగ్ లో భాగంగా అలసిపోయి బాంద్రా బస్టాండ్ బెంచీపై కూర్చున్న వేళ, హర్యానాకు చెందిన ఇద్దరు బాక్సర్లు వచ్చి వేధించారు. రాత్రి తమతో గడిపేందుకు ఎంత కావాలని అడిగారు. ఆపై పూర్ణిమ గట్టిగా అరవడంతో, వాళ్ళు ఆటోలో పారిపోయారు. వారిని ధైర్యంగా వెంబడించిన పూర్ణిమ పోలీసులకు పట్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నటి కావాలన్న ఏకైక కోరికతో ఆరేళ్ల నుంచి మోడల్ గా పనిచేస్తూ, కువైట్, దుబాయ్, యూఏఈ తదితర దేశాల్లో రాణిస్తున్న పూర్ణిమకు గతంలో 'నార్త్ ఇండియా టీన్ క్వీన్' అవార్డు కూడా లభించింది. యూపీ ప్రభుత్వం తీసిన మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి పేరు తెచ్చుకుంది. జమ్మూకు చెందిన పూర్ణిమ అవకాశాల కోసం ముంబైలో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల ఓ రాత్రి 10:30 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ, అలసిపోయి బస్టాండు బెంచీపై కూర్చుని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ బస్టాండ్ నిర్మానుష్యమేమీ కాదు. ఆ సమయంలో ఎంతో మంది అక్కడ ఉన్నారు కూడా. ఇంతలో బలిష్టంగా ఉన్న ఓ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఏమైనా సాయం కావాలా? అని అడిగాడు. పట్టించుకోకుండా పూర్ణిమ తన ఫోన్ తో బిజీగా ఉంది. ఈలోగా ఇంకో వ్యక్తి వచ్చి ఆమెకు అత్యంత దగ్గరగా కూర్చున్నాడు. అతన్ని గమనించి పూర్ణిమ భయపడింది. ఊహించినట్టుగానే అతను మాట్లాడటం ప్రారంభించాడు. రేటెంత? అని అడిగాడు. తమతో రాత్రి గడపాలని కోరాడు. పూర్ణిమ సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. వీరు తనను వేధిస్తున్నారని అరుస్తున్నా చుట్టుపక్కల ఉన్నవారు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. పూర్ణిమ గట్టిగా అరుస్తుండటంతో, వారిద్దరూ ఆటోలో పారిపోయారు. ఆ వెంటనే పూర్ణిమ సైతం వారికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో మరో ఆటో ఎక్కేసింది. బాక్సర్ పోకిరీలు వెళుతున్న ఆటో సెయింట్ ఆండ్ర్యూస్ చర్చ్ రోడ్ లోకి ప్రవేశించగానే, అక్కడ పోలీసు నాకాబందీ జరుగుతోందని గమనించిన పూర్ణిమ, ఆటో నుంచి దూకి పరుగున వెళ్లి పోలీసులకు విషయాన్ని వెల్లడించింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు టోకరా ఇచ్చిన ఓ పోకిరీ తప్పించుకు పారిపోయాడు. అప్పటికీ వారికి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టాలన్నదే తన ఉద్దేశమని, అయితే, ఇద్దరిలో ఒక పోకిరీ పోలీసుల దగ్గర్నుంచీ పారిపోవడంతో తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయించానని పూర్ణిమ తెలిపింది. తమకు పట్టుబడ్డ యువకుడి పేరు దినేష్ యాదవ్ (27) అని అతనిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టామని, రెండో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పూర్ణిమ ధైర్యాన్ని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.