: జూబ్లీహిల్స్ ను మించిన విజయవాడ, గుంటూరు అద్దెలు... సింగిల్ బెడ్ రూం రూ. 15 వేలు!
విజయవాడ, గుంటూరు పరిసరాల్లో అద్దెలు ఎంతగా పెరిగిపోయాయంటే, హైదరాబాద్ లో ధనవంతులు నివసించే జూబ్లీహిల్స్ లో సైతం లేనంతగా! ఈ విషయాన్ని ఉద్యోగులను విజయవాడకు తరలించే నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు ఏపీ సర్కారు నియమించిన కమిటీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రాజధానికి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధి వరకూ సింగిల్ బెడ్ రూం రూ. 15 వేలు, డబుల్ బెడ్ రూం రూ. 18 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఉన్నాయని ఈ కమిటీ గుర్తించింది. ఒకవేళ ప్రభుత్వమే కల్పించుకుని ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదని వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, విజయవాడ, గుంటూరు మధ్య అద్దెల నియంత్రణకు చట్టాన్ని అమలు చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని వ్యతిరేకించినట్టు సమాచారం. రాజధానికి భూమి కోసమే చట్టాన్ని ప్రయోగించని ప్రభుత్వం, అద్దెలపై చట్టాన్ని ఎలా తెస్తుందని ఆయన ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు. దీంతో విజయవాడకు వచ్చే ఉద్యోగులకు వసతిపై ప్రత్యామ్నాయాల వెతుకులాటలో పడిపోయారు.