: గుర్గావ్ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత పర్మిందర్ కటారియాపై అత్యాచార కేసు
ఓ మహిళను బెదిరించి లోబర్చుకున్న వ్యవహారంలో ఢిల్లీ శివారు గుర్గావ్ డిప్యూటీ మేయర్, బీజేపీ నేత పర్మిందర్ కటారియాపై అత్యాచారం కేసు నమోదైంది. తనకు ఉద్యోగం ఇస్తానంటూ ఆశ చూపాడని, పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడని ఆరోపిస్తూ ఓ మహిళ కటారియాపై ఫిర్యాదు చేసింది. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కటారియా పరారీలో ఉన్నాడని, ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారి దీపక్ సహరాన్ తెలిపారు. తనకున్న పలుకుబడి, పరిచయాలతో గుర్గావ్ మునిసిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ బాధితురాలిని నమ్మించి, వశపర్చుకున్నట్టు తమకు తెలిసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్, వెంటనే కటారియా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించింది.