: క్యూ-2 రిజల్ట్స్ ప్రకటించిన భారతీ ఎయిర్ టెల్... ఈక్విటీలు అమ్మేసుకుంటున్న ఇన్వెస్టర్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రైవేటు రంగ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 4.3 శాతం పెరిగి రూ. 23,852 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం 10.1 శాతం వృద్ధితో రూ. 1,523 కోట్లకు పెరిగింది. మొబైల్ డేటా ఆదాయం 50 శాతం పెరిగి రూ. 3,806 కోట్లకు చేరిందని, డేటా ట్రాఫిక్ 76.3 శాతం పెరిగిందని తెలిపింది. కాగా, ఈ ఫలితాలు నిపుణుల అంచనాలకు దూరంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. అంతకుముందు రేటింగ్ సంస్థలు నిర్వహించిన పోల్ లో, ఎయిర్ టెల్ మరింత ఆదాయాన్ని నమోదు చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. సెషన్ ఆరంభం నుంచి స్వల్ప లాభాల్లో నడుస్తూ వచ్చిన ఎయిర్ టెల్ ఈక్విటీ, ఫలితాల వెల్లడి తరువాత అమ్మకాల ఒత్తిడికి గురైంది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఎయిర్ టెల్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 1.84 శాతం నష్టపోయి రూ. 352 వద్ద ట్రేడవుతోంది. భారీ స్థాయిలో ఈక్విటీలు చేతులు మారుతున్నాయి.