: స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి... లాక్కోవద్దు: అమరావతి భూసేకరణపై జగన్ ఫైర్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన భూములను ఏపీ ప్రభుత్వం సేకరించిన తీరుపై ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి, అంతేకాని బలవంతంగా లాక్కుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని ఆయన ప్రకటించారు. నిన్న రాత్రి విజయవాడకు వచ్చిన జగన్, కొద్దిసేపటి క్రితం తుళ్లూరు పరిధిలోని మల్కాపూర్ లో ఇటీవల దగ్ధమైన చెరకు తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని జగన్ విమర్శించారు. బీహార్ కన్నా ఏపీలోనే అరాచకం పురి విప్పి ఆడుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను బీహారీలకు చూపిస్తే, తమ రాష్ట్రంలో కంటే ఇక్కడే అరాచకాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని బీహారీలు చెబుతారన్నారు. బాధిత రైతులకు తాము అండగా ఉంటామని ఆయన ప్రకటించారు.