: ఏపీలో 'మందుకొట్టి డ్రైవింగ్' వద్దే వద్దు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు కూడా మద్యం తాగి వాహనాలు నడిపే వారు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసులకు సూచించారు. ఈ ఉదయం జిల్లా స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. పట్టుబడిన వారికి కఠిన శిక్షలు విధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, హైవేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని వాహనాలు అధిగమించకుండా చూడాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక టీములను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడికక్కడ రోడ్లపై హెచ్చరిక బోర్డులను పెట్టాలని, డ్రంకెన్ డ్రైవ్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.